Monday, August 16, 2010

నా కథలు 4


ఇది నా మొదటి కథ. డిగ్రీ చేస్తున్నపుడు రాసినది. రాసిన కథ రెండోది. మొదటిది బుట్ట దాఖలు కాగా ఇది ప్రచురితం అయింది. నా అదృష్టం కొద్దీ చెత్తబుట్టకు చేరుకున్న కథలు తక్కువే. బహుశా 4 కథలేమో ! కాస్త ముదిరాక పేపర్లలో మిత్రులు పెరగడంతో కథ వేయించుకోవడం సులభం అయింది. అయితే నాకే చెత్త అనుకున్నవి కూడా ఉన్నాయి. అవి కూడా బ్లాగులో పెడతాను. ఓపిక ఉన్నవారు చదివి నన్ను తిట్టుకోవచ్చు. 


Friday, August 6, 2010

మా రూమ్మేటు - నక్సలైటుశరత్ గారు రాసిన పోస్టు చదివాక నాకు ఇది గుర్తుకు వచ్చింది. ఒకసారి నక్సలైటు నాయకురాలు వారి ఇంటికి వెళ్లారట అది ఆయన పోస్టు సారాంశం.సరే నా అనుభవం చెప్తాను. 1993 లో అనంతపురంలో డిగ్రీ చేస్తున్నప్పటి కథ. కొందరం మిత్రులం కలసి కోర్టు రోడ్డులో రూంలో వుండే వాళ్ళం. బ్యాచిలర్ రూములంటే ప్రతి రోజూ ఎవరో ఒకరి ఫ్రెండ్ రావడం మామూలే కదా. కొన్నాళ్ళకు వాళ్ళు కూడా మనకు మంచి మిత్రులైపోతారు. మా రూమ్మేటు ఆది కేశవయ్య అని ఉండేవాడు. ఆయన మిత్రుడు సోమలా నాయక్ ( ఒక వేళ పేరు కొంచెం తేడ వుండొచ్చేమో, కానీ నాయక్ అన్నది కరెక్టే ) తరచుగా రూంకు వస్తుండేవాడు. వయసులో కాస్త పెద్దవాడు కావడంతో మేము అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు. ఎప్పుడూ నీటుగా టక్ చేసుకుని, బూట్లు వేసుకుని హుందాగా ఉండేవాడు. వెంట ఒక బ్యాగు తప్పకుండా వుండేది. ఒకటి రెండు రోజులు ఉండేవాడు. అందరం కలిసి భోంచేసేవాళ్ళం. ( మాకు అదో మంచి అలవాటు ఉండేది, రూమ్మేట్లు అందరం వచ్చాక మాత్రమే భోజనం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ రోజు ముందే చెప్పేవారు, తాము భోజనానికి రావడం లేట్ అవుతుంది మీరు లాగించేయండని. )


తర్వాతి సంవత్సరం మేము రూము మారాము. సోమలా నాయక్ చాలా రోజుల్నుంచి రావడం లేదు ఏమయ్యాడు అని ఆది కేశవయ్యను అడిగాము. ఈ మధ్య పోలీసుల నిఘా ఎక్కువైందని ఆది చటుక్కున నోరు జారాడు.


మావాళ్ళు ఠక్కున అటెన్షన్ లోకి అతన్ని పీడించి విషయం లాగేశారు. సోమలా నక్సలైటు అని, బ్యాగులో గన్ ఎప్పుడూ ఉండేదని చల్లగా చెప్పాడు. అంతే అందరం కలిసి ఆదిని సోమలాను మించిన ఉగ్రవాదిగా చూసి నానా తిట్లు తిట్టాము. ఇంకోసారి సోమలా రూంకు వస్తే నిన్ను కూడా తన్ని తగలేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చాము. ఆ తర్వాత మరెప్పుడూ సోమలాను మేము చూడలేదు. అది అక్కదితో ముగిసింది.

నేను డిగ్రీ బి.ఈడీ పూర్తి చేసి తర్వాత 1997లో ఈనాడు జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ పొందుతున్న కాలం. సాయంత్రం క్లాస్ అయిపోగానే లైబ్రరీకి పరిగెత్తేవాళ్ళం జిల్లా ఎడిషన్ చూడటానికి. మన జిల్లాలో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలన్న ఉత్సాహం. ఇప్పటిలా మొత్తం పేపర్లన్నీ ఒకచోట చూసే వీలు అప్పుదు లేదు. జిల్లా ఎడిషన్ రెండు రోజులు ఆలస్యంగా లైబ్రరీకి వచ్చేది. ఒకరోజు పేపర్లో నక్సల్ ఎంకౌంటర్ అని వార్త వచ్చింది. ఇన్ సెట్ లో ఫోటో చూసి ఎక్కడో చూసామే అనుకుంటూ వార్త లోకి వెళ్ళాను. కొన్ని క్షణాలకు గుర్తుకు వచ్చింది, మన ఆది ఫ్రెండని.


ఆయన మార్గం, వ్యవహారాలు మంచివో చెడో నాకైతే తెలీదు కానీ ఎంకౌంటర్ మరణం అనేది బాధ కలిగించింది.