Monday, May 31, 2010

ఎవరండీ ఈ వీఐపీలు???



మంత్రులు, ఇంకా ఎవారైనా వీఐపీలు వస్తూ వెళ్తూ ట్రాఫిక్ పరంగా ఎంతో ఇబ్బంది కలుగజేస్తుంటారు. ప్రజలు వారికోసం ఆగాలి. వాళ్ళు ఓ మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుండగానే ఈ హడావిడి మొదలు. హైదరాబాద్ వాళ్లూ అలవాటుపడిపోయి ఉండొచ్చు. కానీ అనంతపురంలో నెలకు ఒకటి రెండుసార్లు అదీ ఓ 5 నిముషాల పాటు ఎక్కడైనా ట్రాఫిక్ ఆగవచ్చు. అలాంటిది నిన్న పోలీసులు చేసిన హడావిడికి జనాలు బండ బూతులు తిట్టుకున్నారు. ఈ రోజు ఇక్కడ సీఎం కార్యక్రమం ఉంది. అందుకు పోలీసులు ట్రయల్ రన్ వేశారు. అనంతపురం వృత్తాకారంగా విస్తరించివుడటం వల్ల పట్టణ పరిధి చాలా తక్కువే. అసలు ట్రయల్ రన్ అంత సీన్ లేదు. కానీ మన వాళ్ళేమో సీఎం కాదుకదా పీఎం ఏకంగా వచ్చేసి వీధుల్లొ నడుస్తున్న  బిల్డప్ ఇచ్చారు. 


ప్రజల సహనానికి పరీక్ష పెట్టారు. బైక్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినపుడు కొన్ని ఆణిముత్యాలు వెలువడ్డాయి ప్రజల నోటి నుంచి అవి...


" ఈ నా కొడుకులకు వోటు వెసేది మనం, గెలిపించేది మనం, ఇబ్బంది పడేది మనం. ఓటేసి మనం వాయించుకున్నట్లు ఉంది ( నిజానికి ఇక్కడ ఒక బండ బూతు పడింది ) "


" జనాల సొమ్ము లక్షలకు లక్షలు సంకనాకిస్తున్నారు... ( బూతు )"


" రోశయ్యకు ఇంత  అవసరమా? "


" పోలీసులు ఈ రోజు  హడావిడి చేస్తారు, రేపు అసలు టైంలో కాన్వాయ్ లోకి పిల్లి కూన కూడా దూరగలదు " 


ఇలా జనాలు అసహనాన్ని ప్రదర్శించారు. 


నిజమే వీళ్ళందరికీ ఆ వీఐపీ స్టేటస్ ఎలా వచ్చింది? ప్రజలతోనే కదా ?


ప్రాణ హాని వున్నవాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రతిదానికీ లిమిట్ ఉంటుంది కదా? చివరకు ట్రాఫిక్ ఆపి వీళ్ళు దర్జాగా పోవడం ఒక స్టేటస్ సింబల్ కూడా అయిందేమో! కొన్ని దేశాల్లో వీఐపీలు క్యూలో నుంచున్నారని వార్త చదివినపుడల్లా నాకు ఎంతో ముచ్చట వేస్తుంటుంది. వాళ్ళు అలవర్చుకున్న సంస్కారానికి సంతోషం కలుగుతుంది. 


ఇక ఈ ఇరిటేషన్ను అసహ్యకరంగా, జీర్ణించుకోలేకుండా చేసిన ఘనత మాత్రం ప్రస్తుత టీటీడీ పాలక మండలి. 


అయినా అనుభవించాల్సిందే. తిట్టుకోవాల్సిందే. మరచిపోవాల్సిందే. 


ఈ టపాకు ముక్తాయింపుగా కార్తీక్ రాసిన చక్కటి టపాను ఒకసారి చదవండి. 


http://nenu-naa-svagatam.blogspot.com

Saturday, May 29, 2010

వెంటాడిన దెయ్యం!!





ఇది మా మిత్రుడికి జరిగిన ఘటన. చాలా సంవత్సరాల కిందట ఈ ప్రపంచం ఇంత స్పీడు లేని కాలం. అతను కర్నూల్ లో చదివేవాడు. అనంతపురం అర్జెంటుగా రావలసి వచ్చింది. రాత్రి పన్నెండు దాటిన తర్వాత ఏదో ప్రైవేటు వాహనంలో వచ్చాడు. అది టౌనుకు దూరం నుంచి పొయే బైపాస్ రోడ్ లో వదిలింది. అక్కడి నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు వాళ్ల ఇల్లు. నడక మొదలుపెట్టాడు. 


దిగినచోటు ఒక చిన్న కాలనీ లాగా ఉంటుంది. అది దాటిన తర్వాత అంతా నిర్మానుష్యమే. మనవాడు నడక సాగిస్తున్నాడు. కాలనీలో వెలుగుతున్న లైట్లు అంతోఇంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఎప్పుడో ఒక సారిగానీ అరకొర వాహనాలు పొతున్నాయి. ఎంత ధైర్యంగా ఉందాం అనుకున్నా ఒక పక్క గుబులు గుబులుగా ఉంది. లైట్లు దూరం అయిపోయాయి. చీకటి పరచుకుంది. చెట్లలోంచి కీచురాళ్ల అరుపులు, దూరంగా కుక్కల అరుపులు ఇలా బ్యాక్ గ్రౌండ్ మొదలైంది. మన వాడిలో అంతవరకు ఉన్న ధైర్యం నీరుగారుతూ వచ్చింది.  


అప్పుడు వినిపించింది చూడండి గజ్జెల లాంటి శబ్దం. ఇతగాడి గుండె ఝల్లుమనింది. ఆంజనేయ దండకం చదువుతూ కొంచెం వేగంగా నడిచాడు. శబ్దం మరింత ఎక్కువ అయింది. చెమట్లు పట్టేశాయి. చుట్టూ నరమానవుడు లేడు. ఏమి చేయడానికి లేదు. ఇక పరుగు మొదలు పెట్టాడు. ఈ సారి తన వెనుకనే తన మీదనే గజ్జెలు చప్పుడు చేస్తున్న ఫీలింగ్. ఆయాసం వచ్చే వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు. గజ్జెల శబ్దం వెంటాడుతూనే ఉంది. ఈ లోపు దూరంగా టౌనులో లైట్లు కనబడుతున్నాయి. పరిగెత్తుతున్న వాడల్లా టక్కున ఆగాడు. గజ్జెల శబ్దం కూడా ఆగి పోయింది.  


పరిగెత్తడం ఆగడం ఇలా చేస్తూనే ఇంటివరకు వచ్చాడు. అప్పటివరకూ శబ్దం కూడా అతన్ని వెంబడిస్తూనే ఉంది. గుండె దడతోనే బ్యాగు తీసి ఆవల విసిరేసి అరకొరగా నిద్రపోయాడు. 




పొద్దున లేస్తూనే రాత్రి సన్నివేశమే కళ్ళ ముందు మెదిలింది. జీవితంలో మొదటి సారి దెయ్యాన్ని ఎదుర్కున్నానని అలోచిస్తూ బ్యాగులోని బట్టలు, పుస్తకాలు తీసి బయటపెట్టాడు.


అడుగున గ్లాస్ సీసా ఉంది. హార్లిక్స్ లాంటివి వస్తాయే అది. ఈ సీసాల్లొనే గన్ పౌడర్ నిలువ చేసేది. గన్ పౌడర్ అంటే వేరుశెనగ విత్తనాలతో తయారు చేసిన పొడి. రాయలసీమ విద్యార్థులకు ఇది లేనిదే ముద్ద దిగదు. ఇంటికి వచ్చినపుడు అమ్మ సీసా నిండా పొడి వేసిస్తే మళ్ళీ ఊరికి వెళ్ళే దాకా దాన్ని రోజూ ఇంత ప్రసాదంలా అన్నంలో తినేవాళ్ళం. ఈ పొడి సీమ ప్రజలకు ఆరో ప్రాణం అనుకోండి.  



సరే మన మిత్రుడు ఖాళీ సీసాను తీసుకుని తేరిపార చూశాడు. ఆ ఖాళీ సీసాలో ఒక స్పూన్ కనబడింది. ( పొడి వేసుకోడానికి అందులో ఒక స్పూన్ వేయడం రివాజు )









Thursday, May 27, 2010

దయచేసి నా కొత్త బ్లాగును ఒకసారి సందర్శించండి




మిత్రులారా అందరికీ నమస్కారం,

ముందుగా నన్ను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు ఎస్వీ.ప్రసాద్. నేను ఉపాధ్యాయుడిని. నేను జీవని స్వచ్చంద సంస్థ  http://jeevani2009.blogspot.com/     కోసం పనిచేస్తున్నాను. జీవని బ్లాగ్ పూర్తిగా సేవా దృక్పథంతో కొనసాగుతుంది. దాన్ని పూర్తి వివాదరహితంగా నడుపుతున్నాము.  ఈ క్రమంలో నా సొంత ఆక్రోశం, అభిప్రాయాలు, అనుభవాలు పంచుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అందుకే దీన్ని క్రియేట్ చేశాను.

దయచేసి ఒక్క విషయాన్ని గమనించండి. నా అభిప్రాయలతో జీవని బ్లాగ్ కు ఎలాంటి సంబంధం లేదు. మామూలుగా నేను కూడా ఎవరినీ నొప్పించను. సాధుజీవినే. ఒక వేళ ఖర్మగాలి ఎవరైనా ఇబ్బంది పడినా ఆ ప్రభావాన్ని జీవని మీద చూపించవద్దని, నా గోడు వెళ్లబోసుకోడానికి అవకాశం ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాను.