Thursday, June 3, 2010

మా ఊరి సామెత 1

హుశేనప్ప తాడిమర్రికి పోయినట్లు...


ఒక ఊరిలో రైతు దంపతులు ఉండేవారు. వారి ఇంట్లో హుశేనప్ప అనే పాలేరు పని చేసేవాడు. రైతు సోదరుడు తాడిమర్రి అనే ఊరిలో ఉండేవాడు. ఒక రోజు రైతు తన సోదరునికి సమాచారం పంపించాల్సి వచ్చింది. అప్పుడు బస్సులు కూడా లేని కాలం. 


రాత్రి భోజనాలు అయిన తర్వాత రైతు దంపతులు తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు. పొద్దున్నే హుసేనప్పను తాడిమర్రికి పంపాలని వారు చర్చించారు. ఆ విషయాన్ని బయట ఉన్న హుసేనప్ప విన్నాడు. 


వేకువనే రైతు లేచాడు. హుసేనప్పను బయల్దేరదీద్దామని చూశాడు. అతగాడు కనబడలేదు. సరే ఒకటికో రెండుకో వెళ్ళి ఉంటాడు లెమ్మని తన పనిలో నిమగ్నమయ్యాడు. 


ఓ గంట తర్వాత హుసేనప్ప చెమటలు కక్కుకుంటూ వచ్చాడు. 


ఎక్కడికి వెళ్లావురా గాడిదా? తెల్లవారక ముందే నిన్ను తాడిమర్రికి పంపాలని అనుకున్నాము. బారెడు పొద్దెక్కింది, మళ్ళీ రాత్రికి ఎలా తిరిగి రాగలవు అన్నాడు రైతు. 


హుసేనప్ప ముసి ముసి నవ్వులు నవ్వుతూ మీరు చెప్పకనే ఆ పని చేసొచ్చాను అన్నాడు గర్వంగా.


ఏం పని చేశావు? రైతు అయోమయంగా అడిగాడు.


రాత్రంతా ప్రయాణం చేసి తాడిమర్రికి వెళ్ళొచ్చాను.


వెళ్ళి ఏం చేశావురా సన్నాసీ ?


ఏమీ లేదు.  మీరు నన్ను  తాడిమర్రికి పంపాలని రాత్రి అనుకుంటుండగా విన్నాను.  నేను మీరు చెప్పక ముందే  వెళ్ళి వచ్చాను. అని సమాధానమిచ్చాడు. 


రైతు తల బాదుకున్నాడు.


ఎవరైనా పూర్తి వివరాలు కనుక్కోకుండా పని అసంపూర్తిగా చేసుకుని వస్తే వారికి ఈ సామెతను వాడతారు.  5 comments:

 1. దీన్నే పుల్లయ్య వేమారం అంటారు మా ప్రాంతంలో. హుశేనప్ప బదులు పుల్లయ్య. తాడిమర్రి బదులు వేమవరం పెట్టుకోండి.

  ReplyDelete
 2. Interesting. ఇది అనంతపురం సామెతా?

  ReplyDelete
 3. హరే కృష్ణ గారూ ధన్యవాదాలు,

  అభిఙ్ఞ గారూ, అవును అనంతపురం సామెత. ధన్యవాదాలు.

  ReplyDelete