Thursday, July 22, 2010
ప్రతి మరణం లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది
నా మిత్రుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు అయిన ఆకెళ్ళ రాఘవేంద్ర తన పుస్తకం మొదట్లో రాసిన కథ. బహుశా ఈ కథ చాలా మందికి తెల్సే ఉంటుంది. ఒక రాజు కొడుక్కు ఫలానా తేదీన 5 గంటలకు మరణ గండం ఉంది అది కూడా పంది వల్ల అని ఆస్థాన జ్యోతిష్కుడు చెబుతాడు. రాజు రొటీన్ గానే అయన్ని బంధిస్తాడు. ఆ ఫలానా రోజు రానే వస్తుంది. ఓ పదో ఇరవయ్యో అంతస్థుల ఒంటి స్థంభం మేడ మీద రాజు తన కొడుకును పెట్టి మొత్తం సైన్యాన్ని కాపలాగా మొహరిస్తాడు. 4.30 అవుతుంది యువరాజు సేఫ్ అలా సమయం గడుస్తూ ఉంటుంది 4.59 అవుతుంది... 5 గంటలు అవుతుంది. రాజు, యువరాజును చూడటానికి గదిలోకి వెళ్తాడు. అక్కడ యువరాజు లేడు. కంగారుతో అంతటా వెతుకుతారు. చివరగా పై అంతస్థుకు వెళ్ళి చూస్తే అక్కడ రక్తపు మడుగులో యువరాజు కనిపిస్తాడు. వాళ్ళ రాజ చిహ్నం అయిన పంది ప్రతిరూపాన్ని శిలగా ఉంచారు. అది విరిగి మీద పడి యువరాజు చనిపోయివుంటాడు. గుర్తున్నంతవరకు రాశాను, బహుశా తేడాలు ఉండొచ్చు కానీ కథ కాన్సెప్టు కరెక్టే.
దీన్నుంచి గ్రహించాల్సింది... నువ్వు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా పోతావో తెలీదు. అందుకే నీ జీవితంలో ఏవైనా మంచి పనులు చేయాలని ఉంటే ఎప్పుడూ వాయిదా వేయకు అని రాఘవేంద్ర చెప్తాడు. వీలైనంత త్వరగా చేసెయ్యాలి. మామూలుగా కూడా ఎప్పుడైనా అంత్య క్రియలకు వెళ్తే అంతో ఇంతో వైరాగ్యం మామూలే. రాఘవేంద్ర మాటలు విన్నప్పట్నుంచి నా మైండ్ సెట్ కూడా అలాగే మారింది. త్వరగా పనులు కానీయాలి అని అంతరాత్మ హెచ్చరిస్తూ ఉంటుంది. లక్ష్యం వైపు మరింత ముందుకు జరిగామని తప్పకుండా అనిపిస్తూ ఉంటుంది. t
Tuesday, July 13, 2010
Sunday, July 4, 2010
ఏనుగు ఆపాన వాయువు వదిలినట్లు... సామెత- 2
ఈ సామెతను వాడుకలో ఎలా అనుకుని ఉంటారో మీరే ఊహించుకోండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. వాడికి ఎప్పట్నుంచొ ఒక సందేహం. మనుషులు ఆపాన వాయువు వదిలినపుడు ఒకో సరి పెద్ద శబ్దమే వస్తుంది కదా, మరి ఏనుగు వదిలితే ఇంకేమైనా ఉందా? కనీసం వాంబు పేలిన శబ్దమైనా రాదా అని అనుకునేవాడు. కానీ వాడి సందేహం అలాగే ఉండిపోయింది.చాలా ఎళ్ళు గడిచాయి. ఒక సారి వాళ్ళ ఊరికి సర్కస్ వాళ్ళు వచ్చారు. వాడు సంతోషంతో చంకలు గుద్దుకున్నాడు. ఇన్నాళ్ళకు తన సందేహం తీరుతోంది కదా అని! మరుసటి రోజు తెల్లవారుఝామునే రెడీ అయి ఏనుగు దగ్గరకు వెళ్ళాడు. తెల్లారింది, ఊహూ ఏనుగు బాంబు వేయలేదు. సమయం గడుస్తోంది. వాడు ఎందుకు కూచున్నాడో మెల్లగా గ్రామస్థులందరికీ తెలిసిపోయింది. వాడిది ఎంత తెలివైన సందేహమో అని అందరూ తెగ పొగిడారు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అని వారూ ఓ నిర్ణయానికి వచ్చారు. పనులు వదిలిపెట్టి వాడితో పాటు కూచున్నారు. మధ్యాహ్నం అయింది. ఏనుగు అటూ ఇటూ కదులుతోంది, తొండం ఊపుకుంటోంది కానీ బాంబు గురించి పట్టించుకోవడం లేదు. సర్కస్ వాళ్ళు తమకు పబ్లిసిటీ వస్తుంది కదా అని వినొదం చూస్తున్నారు. సాయంత్రం అవుతోంది. అందరికీ ఆసక్తి సన్నగిల్లుతోంది. అందరూ తలో మాట అనుకుంటున్నారు. ఉనంట్టుండి ఏనుగు అటెన్షన్లోకి వచ్చింది.కదలక మెదలక నిల్చుంది. దాని బాడీ లాంగ్వేజి వాళ్ళకు అర్థం అయింది. దగ్గర్లో ఉన్నవారు భయపడి పరుగులు తీశారు. దూరంగా నిలబడి భీతితో చూడసాగారు. కొన్ని సెకెన్ల తర్వాత తుస్సుమని ఆపాన వాయువు వదిలింది.
ఏదైనా భారీగా జరుగుతుందన్నది అట్టర్ ఫ్లాప్ అయితే దాన్ని పైన చెప్పినట్లు పోలుస్తారు.
Saturday, July 3, 2010
Saturday, June 26, 2010
నా డిక్షనరిలో ఆ పదం లేదు
మా మిత్రుడు రవి ఒకానొక కార్పొరేట్ కళాశాలలో ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తున్నాడు. చాలా మేధావి. ఒకసారి మీటింగ్ జరుగుతోందట. క్లాసుల పరంగానే కాక ఇలా మీటుంగులతోనూ వారి తాట తీస్తుంటారట. బహుశా విజయవాడలో మీటింగ్. రాష్ట్రం నలుమూలల్నుంచి అన్ని బ్రాంచుల నుంచి హాజరయ్యారు. మీటింగ్ చాలా సీరియస్ గా జరుగుతోంది. వీరి పై స్థాయి ఆయన ఏదో కొత్త విషయం చెప్పి దాన్ని అమలు చేయాలని చెప్పాడు. అయితే అది అంత సులభమైన విషయం కాదు. అమలు చేయడంలో చాలా సమస్యలు ఉన్నాయని ఇంపాజిబుల్ అని లెక్చరర్లు, ప్రొఫెసర్లు చెప్పారు.
అధికారి కూడా అంతే సీరియస్ గా, లేదు అమలు చేయాల్సిందే. ఇంపాజిబుల్ అన్న పదం నా డిక్షనరీలోనే లేదు అన్నాడట.
వెనుక వరుసలో కూచున్న రవి, ఆ విషయం మీరు ముందే చూసుకోవాలి సార్ ! ఇప్పుడు చెప్పి ఏం లాభం. డిక్షనరీ కొన్నపుడే పదాలన్ని ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి అని అన్నాడు.
Thursday, June 3, 2010
మా ఊరి సామెత 1
హుశేనప్ప తాడిమర్రికి పోయినట్లు...
ఒక ఊరిలో రైతు దంపతులు ఉండేవారు. వారి ఇంట్లో హుశేనప్ప అనే పాలేరు పని చేసేవాడు. రైతు సోదరుడు తాడిమర్రి అనే ఊరిలో ఉండేవాడు. ఒక రోజు రైతు తన సోదరునికి సమాచారం పంపించాల్సి వచ్చింది. అప్పుడు బస్సులు కూడా లేని కాలం.
రాత్రి భోజనాలు అయిన తర్వాత రైతు దంపతులు తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు. పొద్దున్నే హుసేనప్పను తాడిమర్రికి పంపాలని వారు చర్చించారు. ఆ విషయాన్ని బయట ఉన్న హుసేనప్ప విన్నాడు.
వేకువనే రైతు లేచాడు. హుసేనప్పను బయల్దేరదీద్దామని చూశాడు. అతగాడు కనబడలేదు. సరే ఒకటికో రెండుకో వెళ్ళి ఉంటాడు లెమ్మని తన పనిలో నిమగ్నమయ్యాడు.
ఓ గంట తర్వాత హుసేనప్ప చెమటలు కక్కుకుంటూ వచ్చాడు.
ఎక్కడికి వెళ్లావురా గాడిదా? తెల్లవారక ముందే నిన్ను తాడిమర్రికి పంపాలని అనుకున్నాము. బారెడు పొద్దెక్కింది, మళ్ళీ రాత్రికి ఎలా తిరిగి రాగలవు అన్నాడు రైతు.
హుసేనప్ప ముసి ముసి నవ్వులు నవ్వుతూ మీరు చెప్పకనే ఆ పని చేసొచ్చాను అన్నాడు గర్వంగా.
ఏం పని చేశావు? రైతు అయోమయంగా అడిగాడు.
రాత్రంతా ప్రయాణం చేసి తాడిమర్రికి వెళ్ళొచ్చాను.
వెళ్ళి ఏం చేశావురా సన్నాసీ ?
ఏమీ లేదు. మీరు నన్ను తాడిమర్రికి పంపాలని రాత్రి అనుకుంటుండగా విన్నాను. నేను మీరు చెప్పక ముందే వెళ్ళి వచ్చాను. అని సమాధానమిచ్చాడు.
రైతు తల బాదుకున్నాడు.
ఎవరైనా పూర్తి వివరాలు కనుక్కోకుండా పని అసంపూర్తిగా చేసుకుని వస్తే వారికి ఈ సామెతను వాడతారు.
Monday, May 31, 2010
ఎవరండీ ఈ వీఐపీలు???
మంత్రులు, ఇంకా ఎవారైనా వీఐపీలు వస్తూ వెళ్తూ ట్రాఫిక్ పరంగా ఎంతో ఇబ్బంది కలుగజేస్తుంటారు. ప్రజలు వారికోసం ఆగాలి. వాళ్ళు ఓ మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుండగానే ఈ హడావిడి మొదలు. హైదరాబాద్ వాళ్లూ అలవాటుపడిపోయి ఉండొచ్చు. కానీ అనంతపురంలో నెలకు ఒకటి రెండుసార్లు అదీ ఓ 5 నిముషాల పాటు ఎక్కడైనా ట్రాఫిక్ ఆగవచ్చు. అలాంటిది నిన్న పోలీసులు చేసిన హడావిడికి జనాలు బండ బూతులు తిట్టుకున్నారు. ఈ రోజు ఇక్కడ సీఎం కార్యక్రమం ఉంది. అందుకు పోలీసులు ట్రయల్ రన్ వేశారు. అనంతపురం వృత్తాకారంగా విస్తరించివుడటం వల్ల పట్టణ పరిధి చాలా తక్కువే. అసలు ట్రయల్ రన్ అంత సీన్ లేదు. కానీ మన వాళ్ళేమో సీఎం కాదుకదా పీఎం ఏకంగా వచ్చేసి వీధుల్లొ నడుస్తున్న బిల్డప్ ఇచ్చారు.
ప్రజల సహనానికి పరీక్ష పెట్టారు. బైక్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినపుడు కొన్ని ఆణిముత్యాలు వెలువడ్డాయి ప్రజల నోటి నుంచి అవి...
" ఈ నా కొడుకులకు వోటు వెసేది మనం, గెలిపించేది మనం, ఇబ్బంది పడేది మనం. ఓటేసి మనం వాయించుకున్నట్లు ఉంది ( నిజానికి ఇక్కడ ఒక బండ బూతు పడింది ) "
" జనాల సొమ్ము లక్షలకు లక్షలు సంకనాకిస్తున్నారు... ( బూతు )"
" రోశయ్యకు ఇంత అవసరమా? "
" పోలీసులు ఈ రోజు హడావిడి చేస్తారు, రేపు అసలు టైంలో కాన్వాయ్ లోకి పిల్లి కూన కూడా దూరగలదు "
ఇలా జనాలు అసహనాన్ని ప్రదర్శించారు.
నిజమే వీళ్ళందరికీ ఆ వీఐపీ స్టేటస్ ఎలా వచ్చింది? ప్రజలతోనే కదా ?
ప్రాణ హాని వున్నవాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రతిదానికీ లిమిట్ ఉంటుంది కదా? చివరకు ట్రాఫిక్ ఆపి వీళ్ళు దర్జాగా పోవడం ఒక స్టేటస్ సింబల్ కూడా అయిందేమో! కొన్ని దేశాల్లో వీఐపీలు క్యూలో నుంచున్నారని వార్త చదివినపుడల్లా నాకు ఎంతో ముచ్చట వేస్తుంటుంది. వాళ్ళు అలవర్చుకున్న సంస్కారానికి సంతోషం కలుగుతుంది.
ఇక ఈ ఇరిటేషన్ను అసహ్యకరంగా, జీర్ణించుకోలేకుండా చేసిన ఘనత మాత్రం ప్రస్తుత టీటీడీ పాలక మండలి.
అయినా అనుభవించాల్సిందే. తిట్టుకోవాల్సిందే. మరచిపోవాల్సిందే.
ఈ టపాకు ముక్తాయింపుగా కార్తీక్ రాసిన చక్కటి టపాను ఒకసారి చదవండి.
http://nenu-naa-svagatam.blogspot.com
Subscribe to:
Posts (Atom)





