Monday, August 16, 2010

నా కథలు 4


ఇది నా మొదటి కథ. డిగ్రీ చేస్తున్నపుడు రాసినది. రాసిన కథ రెండోది. మొదటిది బుట్ట దాఖలు కాగా ఇది ప్రచురితం అయింది. నా అదృష్టం కొద్దీ చెత్తబుట్టకు చేరుకున్న కథలు తక్కువే. బహుశా 4 కథలేమో ! కాస్త ముదిరాక పేపర్లలో మిత్రులు పెరగడంతో కథ వేయించుకోవడం సులభం అయింది. అయితే నాకే చెత్త అనుకున్నవి కూడా ఉన్నాయి. అవి కూడా బ్లాగులో పెడతాను. ఓపిక ఉన్నవారు చదివి నన్ను తిట్టుకోవచ్చు. 






Friday, August 6, 2010

మా రూమ్మేటు - నక్సలైటు



శరత్ గారు రాసిన పోస్టు చదివాక నాకు ఇది గుర్తుకు వచ్చింది. ఒకసారి నక్సలైటు నాయకురాలు వారి ఇంటికి వెళ్లారట అది ఆయన పోస్టు సారాంశం.



సరే నా అనుభవం చెప్తాను. 1993 లో అనంతపురంలో డిగ్రీ చేస్తున్నప్పటి కథ. కొందరం మిత్రులం కలసి కోర్టు రోడ్డులో రూంలో వుండే వాళ్ళం. బ్యాచిలర్ రూములంటే ప్రతి రోజూ ఎవరో ఒకరి ఫ్రెండ్ రావడం మామూలే కదా. కొన్నాళ్ళకు వాళ్ళు కూడా మనకు మంచి మిత్రులైపోతారు. మా రూమ్మేటు ఆది కేశవయ్య అని ఉండేవాడు. ఆయన మిత్రుడు సోమలా నాయక్ ( ఒక వేళ పేరు కొంచెం తేడ వుండొచ్చేమో, కానీ నాయక్ అన్నది కరెక్టే ) తరచుగా రూంకు వస్తుండేవాడు. వయసులో కాస్త పెద్దవాడు కావడంతో మేము అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు. ఎప్పుడూ నీటుగా టక్ చేసుకుని, బూట్లు వేసుకుని హుందాగా ఉండేవాడు. వెంట ఒక బ్యాగు తప్పకుండా వుండేది. ఒకటి రెండు రోజులు ఉండేవాడు. అందరం కలిసి భోంచేసేవాళ్ళం. ( మాకు అదో మంచి అలవాటు ఉండేది, రూమ్మేట్లు అందరం వచ్చాక మాత్రమే భోజనం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ రోజు ముందే చెప్పేవారు, తాము భోజనానికి రావడం లేట్ అవుతుంది మీరు లాగించేయండని. )


తర్వాతి సంవత్సరం మేము రూము మారాము. సోమలా నాయక్ చాలా రోజుల్నుంచి రావడం లేదు ఏమయ్యాడు అని ఆది కేశవయ్యను అడిగాము. ఈ మధ్య పోలీసుల నిఘా ఎక్కువైందని ఆది చటుక్కున నోరు జారాడు.


మావాళ్ళు ఠక్కున అటెన్షన్ లోకి అతన్ని పీడించి విషయం లాగేశారు. సోమలా నక్సలైటు అని, బ్యాగులో గన్ ఎప్పుడూ ఉండేదని చల్లగా చెప్పాడు. అంతే అందరం కలిసి ఆదిని సోమలాను మించిన ఉగ్రవాదిగా చూసి నానా తిట్లు తిట్టాము. ఇంకోసారి సోమలా రూంకు వస్తే నిన్ను కూడా తన్ని తగలేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చాము. ఆ తర్వాత మరెప్పుడూ సోమలాను మేము చూడలేదు. అది అక్కదితో ముగిసింది.

నేను డిగ్రీ బి.ఈడీ పూర్తి చేసి తర్వాత 1997లో ఈనాడు జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ పొందుతున్న కాలం. సాయంత్రం క్లాస్ అయిపోగానే లైబ్రరీకి పరిగెత్తేవాళ్ళం జిల్లా ఎడిషన్ చూడటానికి. మన జిల్లాలో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలన్న ఉత్సాహం. ఇప్పటిలా మొత్తం పేపర్లన్నీ ఒకచోట చూసే వీలు అప్పుదు లేదు. జిల్లా ఎడిషన్ రెండు రోజులు ఆలస్యంగా లైబ్రరీకి వచ్చేది. ఒకరోజు పేపర్లో నక్సల్ ఎంకౌంటర్ అని వార్త వచ్చింది. ఇన్ సెట్ లో ఫోటో చూసి ఎక్కడో చూసామే అనుకుంటూ వార్త లోకి వెళ్ళాను. కొన్ని క్షణాలకు గుర్తుకు వచ్చింది, మన ఆది ఫ్రెండని.


ఆయన మార్గం, వ్యవహారాలు మంచివో చెడో నాకైతే తెలీదు కానీ ఎంకౌంటర్ మరణం అనేది బాధ కలిగించింది.

Thursday, July 22, 2010

ప్రతి మరణం లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది





నా మిత్రుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు అయిన ఆకెళ్ళ రాఘవేంద్ర తన పుస్తకం మొదట్లో రాసిన కథ. బహుశా  ఈ కథ చాలా మందికి తెల్సే ఉంటుంది. ఒక రాజు కొడుక్కు ఫలానా తేదీన 5 గంటలకు మరణ గండం ఉంది అది కూడా పంది వల్ల అని ఆస్థాన జ్యోతిష్కుడు చెబుతాడు. రాజు రొటీన్ గానే అయన్ని బంధిస్తాడు. ఆ ఫలానా రోజు రానే వస్తుంది. ఓ పదో ఇరవయ్యో అంతస్థుల ఒంటి స్థంభం మేడ మీద రాజు తన కొడుకును పెట్టి మొత్తం సైన్యాన్ని కాపలాగా మొహరిస్తాడు. 4.30 అవుతుంది యువరాజు సేఫ్ అలా సమయం గడుస్తూ ఉంటుంది 4.59 అవుతుంది... 5 గంటలు అవుతుంది. రాజు, యువరాజును చూడటానికి గదిలోకి వెళ్తాడు. అక్కడ యువరాజు లేడు. కంగారుతో అంతటా వెతుకుతారు. చివరగా పై అంతస్థుకు వెళ్ళి చూస్తే అక్కడ రక్తపు మడుగులో యువరాజు కనిపిస్తాడు. వాళ్ళ రాజ చిహ్నం అయిన పంది ప్రతిరూపాన్ని శిలగా ఉంచారు. అది విరిగి మీద పడి యువరాజు చనిపోయివుంటాడు. గుర్తున్నంతవరకు రాశాను, బహుశా తేడాలు ఉండొచ్చు కానీ కథ కాన్సెప్టు కరెక్టే.   


దీన్నుంచి గ్రహించాల్సింది... నువ్వు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా పోతావో తెలీదు. అందుకే నీ జీవితంలో ఏవైనా మంచి పనులు చేయాలని ఉంటే ఎప్పుడూ వాయిదా వేయకు అని రాఘవేంద్ర చెప్తాడు. వీలైనంత త్వరగా చేసెయ్యాలి. మామూలుగా కూడా ఎప్పుడైనా అంత్య క్రియలకు  వెళ్తే అంతో ఇంతో వైరాగ్యం మామూలే. రాఘవేంద్ర మాటలు విన్నప్పట్నుంచి  నా మైండ్ సెట్ కూడా అలాగే మారింది. త్వరగా పనులు కానీయాలి అని అంతరాత్మ హెచ్చరిస్తూ ఉంటుంది. లక్ష్యం వైపు మరింత ముందుకు జరిగామని తప్పకుండా అనిపిస్తూ ఉంటుంది. t

Sunday, July 4, 2010

ఏనుగు ఆపాన వాయువు వదిలినట్లు... సామెత- 2





ఈ సామెతను వాడుకలో ఎలా అనుకుని ఉంటారో మీరే ఊహించుకోండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. వాడికి ఎప్పట్నుంచొ ఒక సందేహం. మనుషులు ఆపాన  వాయువు వదిలినపుడు ఒకో సరి పెద్ద శబ్దమే వస్తుంది కదా, మరి ఏనుగు వదిలితే ఇంకేమైనా ఉందా? కనీసం వాంబు పేలిన శబ్దమైనా రాదా అని అనుకునేవాడు. కానీ వాడి సందేహం అలాగే ఉండిపోయింది.చాలా ఎళ్ళు గడిచాయి. ఒక సారి వాళ్ళ ఊరికి సర్కస్ వాళ్ళు వచ్చారు. వాడు సంతోషంతో చంకలు గుద్దుకున్నాడు. ఇన్నాళ్ళకు తన సందేహం తీరుతోంది కదా అని! మరుసటి రోజు తెల్లవారుఝామునే రెడీ అయి ఏనుగు దగ్గరకు వెళ్ళాడు. తెల్లారింది, ఊహూ ఏనుగు బాంబు వేయలేదు. సమయం గడుస్తోంది. వాడు ఎందుకు కూచున్నాడో మెల్లగా గ్రామస్థులందరికీ తెలిసిపోయింది. వాడిది ఎంత తెలివైన సందేహమో అని అందరూ తెగ పొగిడారు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అని వారూ ఓ నిర్ణయానికి వచ్చారు. పనులు వదిలిపెట్టి వాడితో పాటు కూచున్నారు. మధ్యాహ్నం అయింది. ఏనుగు అటూ ఇటూ కదులుతోంది, తొండం ఊపుకుంటోంది కానీ బాంబు గురించి పట్టించుకోవడం లేదు. సర్కస్ వాళ్ళు తమకు పబ్లిసిటీ వస్తుంది కదా అని వినొదం చూస్తున్నారు. సాయంత్రం అవుతోంది. అందరికీ ఆసక్తి సన్నగిల్లుతోంది. అందరూ తలో మాట అనుకుంటున్నారు. ఉనంట్టుండి ఏనుగు అటెన్షన్లోకి వచ్చింది.కదలక మెదలక నిల్చుంది. దాని బాడీ లాంగ్వేజి వాళ్ళకు అర్థం అయింది. దగ్గర్లో ఉన్నవారు భయపడి పరుగులు తీశారు. దూరంగా నిలబడి భీతితో చూడసాగారు. కొన్ని సెకెన్ల తర్వాత తుస్సుమని ఆపాన వాయువు వదిలింది. 


ఏదైనా భారీగా జరుగుతుందన్నది అట్టర్ ఫ్లాప్ అయితే దాన్ని పైన చెప్పినట్లు పోలుస్తారు.